పచ్చి మామిడికాయ పేరు చెప్పగానే మనందరికీ నోరూరిపోతుంది. మామిడికాయల సీజన్ రాగానే మనలో చాలా మంది ఉప్పు, కారం దట్టించిన పచ్చి మామిడికాయలను తింటుంటాం. కానీ, పెద్దలు మాత్రం పచ్చిమామిడి తినడం వలన అనర్థాలుంటాయంటూ హెచ్చరిస్తుంటారు.
వాస్తవానికి పచ్చి మామిడికాయలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చి మామిడిలో సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి దీనిని తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఇంకా ఇందులో ప్రి-బయొటిక్ డైటరీ ఫైబర్, మినరల్స్, పోలీ ఫినాలిక్ ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇనుమడింపజేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. 100 గ్రా. మామిడిలో 156 మిల్లీ గ్రాముల పొటాసియం ఉంటుంది. ఇది శరీర కణాలను బలోపేతం చేసి, అవసరమైన రసాయనాల విడుదలను సుగమం చేస్తుంది.
రక్తపోటును అదుపు చేసి గుండెను పదిలంగా ఉంచుతుంది. పచ్చి మామిడి గ్యాస్ట్రో ఇంటస్టైనల్ డిజార్డర్స్ బారి నుంచి కాపాడుతుంది. కొత్త రక్తకణాల నిర్మాణానికి సైతం దోహదపడుతుంది.
అయితే మరీ ఎక్కువ తీసుకుంటే గొంతులో మంట, అజీర్తి, విరేచనాల వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకి రెండుకి మించి తినకూడదు. తిన్న తర్వాత వెంటనే మంచినీళ్లు తాగాలి. అలాగే జిగురును పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే వీటిని తినాలి. ఎందుకంటే ఆ జిగురు కడుపులోకి వెళ్తే గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత సమస్యలు వస్తాయి. నోటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.