దేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ వ్యాధిని తగ్గించుకునేందుకు సదరు వ్యాదిగ్రస్తులు అనేక రకాల మందులను వాడుతూ, వివిధ సాంప్రదాయ పద్ధతులను కూడా పాటిస్తుంటారు. శరీరంలో చక్కెర స్థాయిలను సమతౌల్యంగా ఉంచడంలో కోడిగుడ్డు (ఎగ్) చక్కటి పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపణులు చెబుతున్నారు.
వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు మధుమేహాన్ని అదుపు చేయవచ్చని వారు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్ల కూడా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.
డయాబెటిస్ రెండు రకాలు.. 1. టైప్ వన్ 2. టైప్ టు.. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్తోనే బాధపడుతున్నారు. వీరిలో శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లనో లేక అవసరమైన దాని కంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లనో ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్లో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం, వారానికి నాలుగు గుడ్లు తింటే మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందని తేలింది. కోడిగుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారానికి నాలుగు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు.
ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే నాలుగు గుడ్లు తిన్నవారిలో37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.