దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (అప్పట్లో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్) తయారు చేసిన తొలి మోడల్ మారుతి 800 కారు గురించి కార్ ప్రియులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ ఇటీవలే ఈ మోడల్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసినదే.
అయితే.. తాజాగా మారుతి 800 మరోసారి వార్తల్లోకెక్కింది. అదేంటంటే.. ఓ పురాతన మొట్టమొదటి మారుతి 800 కారును కొనేందుకు సెలబ్రిటీలు, ప్రముఖ కంపెనీలు క్యూ కట్టడం. వివరాల్లోకి వెళితే.. మారుతి 800 కారును 1983లో మార్కెట్లో విడుదల చేశారు.
అప్పట్లో ఈ కారు కొనుగోలు కోసం ముందస్తు బుకింగ్లను స్వీకరించగా, కొనుగోలుదారుల నుంచి వందల సంఖ్యలో ధరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంచుకున్నారు. ఆ లక్కీ డ్రాలో హర్ పాల్ సింగ్ అనే వ్యక్తి పేరు వచ్చింది. 1983, డిసెంబర్ 14వ తేదీన అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా హర్ పాల్ సింగ్ తొలి మారుతి 800 కారు తాళం చెవులను అందుకున్నాడు.
ఇదంతా జరిగి 35 సంవత్సరాలు అయింది. కారు కొన్న హర్ పాల్ 2010లో, ఆయన సతీమణి 2012లో కాలం చేశారు. ఇప్పుడు ఆ కారు హర్ పాల్ సింగ్ ఇంటి ఎదుటే సిధిలావస్థలో పడి ఉంది. కాగా.. ఇది మొట్టమొదటి మారుతి 800 కారు కావటంతో, ఆ కారును కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడుతున్నారు.
మళయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, ప్రముఖ క్విజ్ మాస్టర్ డిరెక్ ఓ బ్రియన్, మనేసర్ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం చివరికి మారుతి సుజుకి సంస్థ కూడా ఈ తొలి 800 కారును కొంటామని ముందుకొచ్చింది. హర్ పాల్ సింగ్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఆ కారును విక్రయించే అధికారం వారిద్దరికే ఉంది. మరి ఈ లక్కీ కారును ఎవరు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.