అమెరికాలో ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని సరిహద్దులను మూసివేశారు. ఇదే అదనుగా చేసుకొని ఆ దేశంలోనికి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు భారతీయుల్ని అమెరికా సరిహద్దు పోలీసులు అరెస్టు చేశారు.
బర్క్ అండ్ మస్సెనా బోర్డర్ పెట్రోల్ స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం, కెనడా బోర్డర్ నుంచి అమెరికా బోర్డర్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించగా, ఆ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ఆపకుండా వేగంగా నడపటం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో సదరు వాహన డ్రైవర్ మార్గ మధ్యంలో అనేక బోర్డర్ సెక్యూరిటీ వాహనాలను గుద్దుకుంటూ ముందుకు వెళ్లిపోయి తను నడుపుతున్న కారును యాక్సిడెంట్‌కు గురిచేశాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు భారతీయులు మరియు ఇటలీకి చెందిన ఓ డ్రైవర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ముగ్గురు కూడా కెనడాలోని సెయింట్ రెగిస్ మోహాక్ ఇండియన్ రిజర్వేషన్ గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. వీరికి భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.