కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు గానూ దాతలు స్వచ్ఛందంగా తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు పది లక్షల రూపాయాల విరాళానాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు తన అధికారిక ఫేస్బుక్ పేజీలో చంద్రబాబు నాయుడు ఓ పోస్ట్ పెట్టారు. దాని సారాంశం ఇది…
“కరోనాపై పోరాటానికి మద్దతుగా మా కుటుంబం తరపున కరోనా నివారణకు, బాధితుల సహాయ చర్యలకు రూ.10లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు.
కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చెయ్యాలని తీర్మానించాం. సామాజిక దూరం పాటిస్తూనే, డిజిటల్ సోషలైజేషన్ ద్వారా అందరూ దగ్గరై సమష్టిగా కరోనాను ఎదుర్కోవాలి.
రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికీ రూ.5,000 ఆర్థిక సహాయంతో పాటు, 2 నెలలకు సరిపడా రేషన్ సరుకులను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేయాలని, రైతుబజార్లలో చౌకధరలకే సరకులు అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం”.