కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటం కోసం మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 31వ తేదీ వరకూ లాక్డౌన్ను ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే ఈ లాక్డౌన్ను మరో 21 రోజుల పాటు పొడగిస్తున్నామని, అప్పటి వరకూ దేశంలోని పౌరులు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన ఇవాళ సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
ఇటీవల నిర్వహించిన జనతా కర్ఫ్యూ కంటే మరింత కఠినంగా ఈ లాక్డౌన్ ఉంటుందని, మనం ఈ వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే, సామాజిక దూరం (సోషల్ డిస్టన్స్) పాటించడం తప్ప మనకు వేరే మార్గం లేదని, ప్రధానినైన నేను కూడా ఇందుకేమీ ప్రత్యేకం కానని మోడీ అన్నారు.
కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులు తొలుత మామూలుగానే కనిపించినప్పటికీ, వారి తెలియకుండానే వందలాది మందికి కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యాధిని అంటిస్తారని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా తొలి లక్ష కరోనా కేసులు నమోదు కావడానికి 67 రోజుల సమయం పడితే, తర్వాతి లక్ష కేసులు కేసులు నమోదు కావటానికి కేవలం 11 రోజులు మాత్రమే పట్టింది. కాగా కేవలం నాలుగు రోజుల్లోనే 2 నుంచి 3 లక్షల మంది వ్యక్తులకు ఈ వ్యాధి సోకిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని, కాబట్టి దయచేసి అందరూ ఎవరికి వారే వ్యక్తిగతంగా స్వీయ నిర్భందం చేసుకోవాలని మోడీ ప్రజలను కోరారు.