తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణాలో 59 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇవాళ (మార్చ్ 27, 2020) ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో వెల్లడించారు. తెలంగాణాలో ఇప్పటి దాకా రోజుకు 1-3 కేసులు మాత్రమే నమోదయ్యేవి, ఇవాళ మాత్రం అనూహ్యంగా 10 కేసులు నమోదు కావటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా వచ్చిన 59 మందిలో ఇప్పటి వరకూ ఒక్కరికే నయమైంది, మిగిలిన 58 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనా అనుమానితులుగా భావించే వారిలో సుమారు 20,000 మంది ఉన్నారని, వీరంతా తమ తమ ఇళ్లలోనూ అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వరెంటైన్ సెంటర్లలోను (నిర్భంద గృహాలు) ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితులపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒవకేళ కరోనా కట్టడి దాటితే ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సైతం ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే, ప్రజలందరూ సహకరించి తమకు తాము స్వీయ నిర్బంధం చేసుకోవాలని సూచించారు.
కేసీఆర్ గతంలో తెలిపిన దాని ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఈనెలాఖరు వరకూ లాక్డౌన్ అని ప్రకటించారు. అయితే, తప్పని పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నామని ఈ సందర్బంగా కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ఉంటుందని, ప్రజలందరూ దీనికి సహకరించాలని, ఈ విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. రాత్రి సమయాల్లో ఎప్పటి లానే కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు.