భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కట్టడికి దేశమంతా లాక్డౌన్ పాటిస్తున్నప్పటికీ, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా మరియు డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతోంది. మరోవైపు కరోనా భయంతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఇలాంటివి రెండు కేసులు నమోదయ్యాయి.
ఇటీవలే కర్ణాటకలో ఓ వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా సోకిందేమో అని భయపడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటూ ఓ సూసైడ్ నోట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి వయస్సు 56 ఏళ్లు, అతను విదేశీయానం చేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. చిన్నపాటి అనారోగ్యానికే భయపడిపోయి ఇలా చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.
బహ్రెయిన్ దేశంలో కూడా ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. ఉపాధి కోసం బహ్రెయిన్ దేశం వెళ్లిన తూర్పు గోదావరి జిల్లా వ్యక్తి కరోనా భయంతో అక్కడే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన వర్ధనపు మహేష్ (23) బతుకుదెరువు కోసం బ్రహెయిన్ వెళ్లి కరోనా ప్రభావంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఆ దేశంలో ఉపాధి లేక స్వస్థలానికి వచ్చే అవకాశం లేక తీవ్ర మనోవేదనకు గురై తన గదిలోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. తాజాగా రాజమండ్రిలో కూడా కరోనా వస్తుందనే భయంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రాజమండ్రిలోని ఇద్దరు దంపతులు కరోనా సోకిందనే భయంతో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో డాక్టర్ వద్దకు వెళ్లి వచ్చినట్లుగా ఓ ప్రిస్క్రిప్షన్ మరియు ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరోనా భయంతోనే చనిపోతున్నట్లు ఆ సూసైడ్ నోట్లో ఉంది.
పోలీసులు మరో కోణంలో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఆటోడ్రైవర్‌గా పనిచేసే వాడని, ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల పాలైన నేపథ్యంలో కూడా వీరు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ.. కరోనా వ్యాధి సోకితే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలే కానీ, ఇలా అర్థాంతరంగా ప్రాణాలను బలితీసుకోవటం సరికాదనేది నా భావన.