కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో, కొన్ని చోట్ల పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పక తప్పడం లేదు. ఈ తతంగాన్నంతా నెటిజెన్లు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తమ ఆనందాన్ని, ఆవేదనను ఇతరులకు పంచేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఓవరాక్షన్ చేసిన పోలీసులపై కూడా విచారణ లేకుండానే సస్పెన్షన్ వేటు కూడా పడుతోంది.
ఇలాంటి ఓ ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పెరవలి మండలం ఖండవల్లికి చెందిన ఓ యువకుడు ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు, అతడి గురించి ఆరా తీసిన అధికారులు, ఐసోలేషన్ వార్డుకు వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ, అవేమీ పట్టించుకోకుండా అతడు యధేచ్ఛగా వీధుల్లో తిరుగుతుండటంతో విషయం తెలుసుకున్న ఎస్సై సదరు వ్యక్తి అర్థమయ్యేలా కూసింత గట్టిగానే చెప్పాడు. యువకుడితో పాటుగా బాధ్యత మరచిన తండ్రిపై, అడ్డు వచ్చిన మహిళపై కూడా లాఠీ జులిపించాడు.
కానీ, సోషల్ మీడియా మాత్రం దీన్ని తప్పుగా ప్రచారం చేయటంతో సదరు ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా.. ఇప్పుడే అదే సోషల్ మీడియాలో పెరవలి ఎస్సైకు మద్ధతుగా అనేక మంది పోస్టులు పెడుతున్నారు. భారతదేశాన్ని కరోనా భారి నుంచి అడ్డుకునేందుకు సిన్సియర్‌గా డ్యూటీ చేసినందుకు ఇలాంటి బహుమానాన్ని ఇస్తారా అంటూ నెటిజెన్లు సదరు ఎస్సైకి సపోర్ట్ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఎస్సై సస్పెన్షన్ లో వాస్తవాలు ఇలా ఉన్నాయి. పెరవలి ఎస్సై నీతి నిజాయతీ కల్గిన డ్యూటీ పట్ల నిబద్దత కల్గిన ఆఫీసర్ గత ఆదివారం నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా మండలంలో విదేశాలు నుంచి 127 మందిని గుర్తించి గత సోమవారం నుంచి 4 రోజులుగా ఇంటిటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తూ బయటకు వెళ్లొద్దు అని నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఇదే విషయంలో పూర్తి శ్రద్ద పెట్టిన వాలంటీర్లు ,ఆశావర్కర్లు విదేశాల నుంచి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఖండవల్లి గ్రామంలో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబానికి కౌన్సెలింగ్ ఇస్తే నా ఇష్టం నేను తిరుగుతా అని వాలంటీర్ల మీద అసభ్యంగా మాట్లాడితే దానికి తల్లిదండ్రులు వత్తాసు పలికి వాడికి రోగం లేదు అని ఇంకోసారి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించడం జరిగింది. ఇదే విషయాన్ని సదరు ఎస్సై కి మంగళవారం నాడు వాలంటీర్లు చెప్తే ఎస్సై మళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చినా వినకుండా యధేచ్ఛగా రోడ్లపై తిరగుతుండంతో చేసేది లేక ఎస్సై లాఠీకి పనిచెప్పారు.
సోషల్ మీడియాలో పూర్తి వీడియోని అప్లోడ్ చేయలేదని, ఎస్సై లాఠీతో కొట్టడానికి ముందు ఆ వ్యక్తి పోలీసులను దుర్భాషలాడటం, నాకు నచ్చినట్లు చేస్తా అని చెప్పడం వంటివి ఉన్నాయని అంటున్నారు. ప్రజలపై లాఠీ ప్రభావం చూపిన పోలీసులందరినీ ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే, చివరకు భారతదేశం కూడా మరో చైనా, ఇటలీలా మారిపోతుందని, ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ కాపాడలేరని అంటున్నారు.