కరోనా వైరస్‌తో అమెరికా అల్లకల్లోలమైపోతోంది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఆ దేశం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ కరోనా అంటే ప్రధానంగా చైనా, ఇటలీ దేశాలే గుర్తుకు వచ్చేవి, కానీ ఇప్పడు ఈ రెండు దేశాలను సైతం అధిగమించేసింది అమెరికా.
ఇప్పటి వరకూ చైనాలో 81,285 కేసులు ఉండగా, ఇటలీలో 80,589 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, అమెరికాలో ఈ రెండు దేశాల కంటే గరిష్టంగా 81,896 కరోనా నమోదు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో కొత్తగా 13,685 కేసులు నమోదయ్యాయని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో కరోనా దాడి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో ఎక్కువ కేసులు న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, జార్జియా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో నమోదు కాగా.. దాదాపుగా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కరోనా ధాటికి అమెరికా ఇప్పటికే 1,174 మంది ప్రాణాలు కోల్పోయారు. కంప్లీట్ కంట్రీ షట్‌డౌన్ విషయంలో ఇకనైనా అమెరికా మేల్కొనకపోతే చైనా, ఇటలీల కన్నా ఘోరమైన పరిస్థితులను ఆ దేశం ఎదుర్కోవలసి వస్తుందని విమర్శకులు చెబుతున్నారు.