తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ చాప క్రింద నీరులా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అంతేకాదు, కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థనకు వెళ్లినట్లు సమాచారం ఉందని, హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. కుత్బుల్లాపూర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణాలో మొత్తం కరోనా కేసులు 65కి చేరుకున్నాయి.
ఢిల్లీ నుంచి వచ్చిన వృద్ధుడు అనారోగ్యంతో గ్లోబల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. వైద్య పరీక్షల్లో అతడికి కరోనా సోకిందని తేలింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 959గా ఉంది. కేరళ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.