కరోనా వైరస్ గురించి అసత్య ప్రచారం చేసినా, ప్రజలను భయపెట్టే పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేసినా నిర్ధాక్షణ్యంగా అరెస్టు చేసి జైల్లో పెడుతామని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు ప్రబుద్ధులు మాత్రం తమ వైఖరి మార్చుకోవటం లేదు. కరోనా వైరస్ గురించి ఓ చెత్త పోస్టును ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది.
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ముజిబ్ మహమ్మద్(25) అనే యువకుడు తన ఫేస్బుక్ పేజీలో కరోనా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలయ్యాడు. అతడు ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ఏంటంటే ‘చేతులు కలుపుదాం రండి, బయటకు వెళ్లి బహిరంగంగా తుమ్మండి. కరోనాను వ్యాప్తి చేయండి’.
ఈ పోస్ట్ కాస్తా ఆ నోటా ఈ నోటా చేరి కంపెనీ యాజమాన్యం వరకూ వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన ఇన్ఫోసిస్ కంపెనీ ఇది తమ కంపెనీ ప్రవర్తనా నియమావళికి, బాధ్యతాయుతమైన సామాజిక భాగస్వామ్యానికి వ్యతిరేకమని తక్షణమే అతడిని విధుల నుంచి తొలగిస్తున్నామని తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
కాబట్టి మిత్రులారా.. కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాసే ఆలోచన ఏదైనా ఉంటే, మానుకోవటం మంచిది.