కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్న లాక్డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కరోనా వైరస్ లాక్డౌన్పై ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం (మార్చ్ 29) నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 70కి చేరింది.
ప్రజలందరూ మరో రెండు వారాల పాటు ఇలానే స్వీయ నియంత్రణ పాటించినట్లయితే, కరోనా గండం నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 70 మందిలో ఇప్పటికే 11 మంది కోలుకున్నారని, వీరిని టెస్ట్ చేయగా ఫలితాలు నెగెటివ్ వచ్చాయని, రేపటికంతా వారిని డిశ్చార్జ్ చేస్తామని ఆయన అన్నారు.
ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటున్న వారి ఆరోగ్యం నిలకడానే ఉందని, వీరంతా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ 70 కేసుల తర్వాత కొత్తగా కేసులు ఏవీ నమోదు కాకపోతే, ఏప్రిల్ 7వ తేదీ నాటికి రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా ఉండే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రానికి వచ్చే అన్ని రవాణా మార్గాలు మూసుకుపోయిన నేపథ్యంలో, కొత్తగా విదేశాల నుంచి వచ్చే వారి కరోనా సంక్రమణ జరగదని, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వారి ద్వారానే కరోనా వ్యాపిస్తుందని అన్నారు.