కరోనాపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకుని, వారిని కఠినంగా శిక్షిస్తామని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్పై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
కొన్ని మీడియా సంస్థలు ప్రశాంతంగా ఉన్న ప్రజలను మానసికంగా హింసించేలా, పిచ్చిరాతలో ప్రజలలో అనవసరమైన భయాందోళనలు సృష్టిస్తున్నారని, ఈ పద్ధతి మంచిది కాదని అన్నారు. ఇలాంటి మీడియాల వెనుక ఉన్న వారు ఎవ్వరైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు.
‘కొంత మంది దొంగలు దొరుకుతున్నారు. వారిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షిస్తాం. ఆ శిక్షలు ఎలా ఉంటాయో మీకు చెప్తాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎందుకు ఇటువంటి దిక్కుమాలిన ప్రచారాలు చెయ్యాలి, ఏమి ఆశించి చేస్తున్నారు. అలా చేసేవాళ్లకు అందరికంటే ముందు కరోనా సోకుతుంది, అలాంటి దుర్మార్గులకు కరోనా సోకాలి కూడా. కరోనా విస్పోటనానికి నీవేమి అతీతుడివి కాదు. నువ్వ మనిషివేగా, ప్రజల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నావని’ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణా ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడూ కరోనా పేషెంట్లను పర్యవేక్షిస్తోందని, వైద్య సిబ్బంది రిస్కు తీసుకొని మరి పనిచేస్తుందని, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాము ప్రజలతో పంచుకుంటున్నామని అన్నారు. ఈ విషయంలో అసత్య ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, అలా చేసే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు.