కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లాక్డౌన్లో భాగంగా దేశంలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయటంతో ఈ వ్యసనానికి బానిసలైన మందు బాబులు గడచిన వారం రోజులుగా మద్యం దొరక్కపోవటంతో తీవ్ర మానసిక వత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతుంటే, తాజాగా మన హైదరాబాద్‌లో కూడా ఈ తరహా ఘటనలు నమోదవుతున్నాయి. సినీ పరిశ్రమలో పనిచేసే మధు అనే వ్యక్తి లాక్డౌన్ కారణంగా గత వారం రోజులుగా మందు దొరక్క మానసికంగా కుంగిపోయి బంజారాహిల్స్‌లోని ఓ నాలుగు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు బేగంపేటలో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మద్యం దొరక్క సాయికుమార్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఫ్లై ఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓవైపు కొన్నిచోట్ల అక్రమంగా మద్యం విక్రయాలు సాగుతుంటే మరోవైపు మద్యం దొరక్క ఆ దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న సంఘటనలు కూడా నమోదవుతున్నాయి.