కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కబలించేందుకు వస్తుంటే, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ధైర్యంగా సమస్యను ఎదుర్కునేందుకు తన యంత్రాంగాన్ని, ప్రజలను సంసిద్ధం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో తన రాష్ట్ర ప్రజలకే కాకుండా, రాష్ట్రానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం తమ బిడ్డలుగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడున్నర లక్షల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉన్నారని, వీరిని పరదేశీయులు మాదిరిగా కాకుండా తమ స్వంత బిడ్డల మాదిరిగానే చూసుకుంటామని, వీరంతా రాష్ట్రాభివృద్ధి చేయడానికి వచ్చిన వారేనని, తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న వీరంగా తమ స్వంత రాష్ట్రాలకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని అన్నారు.
వలస కూలీలందరికీ మనిషికి 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున ఇస్తామని కేసీఆర్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా వీటిని సరఫరా చేస్తామని, తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని అన్నారు. వలస కూలీలు ఉన్న ప్రాంతాల్లో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా వారికి మంచినీరు, వసతి, భోజనం, వైద్య సదుపాయాలను అందిస్తామన్నారు.