కరోనా వైసర్ విషయంలో చైనా, ఇటలీ, స్పెయిన్ మరియు అమెరికా వంటి దేశాలు అనుభవిస్తున్న ఘోర పరిస్థితి మన దేశానికి పట్టకూడదని ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను క్షమాపణ కోరారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కొన్ని కఠిమైన నిర్ణయాలు తీసుకోవటం తప్పలేదని అన్నారు.
అనూహ్యంగా ప్రకటించిన ఈ లాక్డౌన్ కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ప్రస్తుత పరిస్థితులు కష్టంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో భారత్కు మంచి రోజులు వస్తాయని ప్రజలందరూ దీనికి సహకరించాలని మోడీ కోరారు. ఈ కష్టాలు తాక్కాలికమేనని, ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వాలు కష్టపడుతున్నాయన్నారు.
‘కరోనా వైరస్ కట్టడి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదు. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు మీరు నన్ను క్షమించాలని దేశ ప్రజలందరినీ కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అత్యధిక జనాభా కలిగిన భారత్ లాంటి దేశంలో కరోనాను కట్టడి చేయటానికి ఇంత కంటే వేరే మార్గం లేదని, ఇదొక యుద్ధం లాంటి పరిస్థితి అని, కరోనాతో యుద్ధమంటే చావుబతుకుల పోరాటమేనని మోడీ అన్నారు. ఈ యుద్ధంలో మనంతా గెలిచి తీరాలని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని, దేశాన్ని మరియు మీ కుటుంబాలను కరోనా మహమ్మారి నుంచి కాపాడటానికి ఇదొక్కటే మార్గమని, దీని వలన ప్రజలకు కలిగిన ఇబ్బందులకు, కష్టాలకు తనను మరోసారి క్షమించాలని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.