గుంటూరు వైఎస్ఆర్సిపి ఎమ్మల్యే ముస్తఫా బావ మరిదికి అలాగే తన స్వంత చెల్లెలికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ముస్తఫాపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి. ముస్తఫా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని, గుంటూరుకు కరోనాను పరిచయం చేసి కొంప ముంచారని, 500 మందికి విందు ఇచ్చి కరోనా వ్యాప్తి చేశారని ఇలా అయనపై అనేక విమర్శలు వచ్చాయి.
ఈ విషయంపై ముస్తాఫా స్పందించారు, మీడియాతో మాట్లాడి వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ నిరాధారమైనవని, ఇలాంటి ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నానని ముస్తఫా అన్నారు. రాజకీయ ప్రత్యర్థులే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారని చెప్పారు.
తాను క్రింది స్థాయి నుంచి వచ్చిన వాడినని, ప్రజల కన్నా పదవేమీ ముఖ్యం కాదని, తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ముస్తఫా బావమరిది ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 500 మందికి విందు ఇచ్చారని వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమేనని, ఇదే విషయాన్ని ఎవరైనా నిరూపించ గలిగితే తన పదవికి రాజీనామా చేస్తానని ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు ఎమ్మెల్యేగా ప్రజల బాగోగులు చూసుకోవటమే తప్ప వారికి హాని తలపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని, తన కుటుంబంలో బావమరిదికి, చెల్లెలికి తప్ప వేరే ఎవ్వరికీ కరోనా సోకలేదని అలాంటప్పుడు తాను వేరొరికి వైరస్ను ఎలా వ్యాప్తి చేయగలనని ముస్తఫా అన్నారు. ముస్తఫా బావమరిది ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థనలకు వెల్లొచ్చారు, ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన అనేక మందిలో ఇప్పుడిప్పుడే కరోనా వ్యాధి లక్షణాలు బయట పడుతున్నాయి.