జబర్దస్త్ యాంకర్ రష్మీ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు, పేదలు, మూగజీవాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లైవ్‌లో చేసిన రష్మీ వారి బాధను తలచుకొని బోరున ఏడ్చేసింది. సమాజానికి తనవంత సాయంగా పేదలకు ఆహారాన్ని పంచి పెట్టింది.
రష్మీకి మూగజీవాలంటే కూడా మక్కువ ఎక్కువే. ఈ లాక్డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూతపడటంతో ఆకలితో అలమటిస్తున్న మూగజీవాల ఆకలి తీర్చేందుకు రష్మీ తన మిత్రులతో కలిసి రోడ్లపై ఉన్న కుక్కలు, ఇతర మూగజీవాల ఆకలి తీర్చేందుకు ప్రయత్నం చేసింది. ఈమేరకు కొన్ని ఫొటోలను కూడా రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫేస్బుక్ లైవ్ వీడియోలో రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘రోజు వారి కూలీలు, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది సమయానికి తిండి కూడా తినడం లేదు. వీధుల్లో కుక్కలు, ఆవులు కూడా ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయంటూ’ రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానులు, ప్రేక్షకులు తోచినంతంగా వాటికి ఆహారం అందించాలని కోరింది. తన వంతు సామాజిక బాధ్యతగా పీఎం కేర్స్‌కు రూ.25,000 విరాళంగా ఇచ్చినట్లు రష్మీ పేర్కొంది.