బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌ను కరోనా వైరస్ విడవటం లేదు. వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే 14 రోజుల్లోనే వారు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వైరస్ విషయంలో కనికా కపూర్ ఆరోగ్యంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కనికాకు ఐదోసారి నిర్వహించిన కరోనా టెస్టుల్లో కూడా పాజిటివ్ రావటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో కనికా కపూర్‌కు ఐదవసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా ఆమెకు పాజిటివ్ రావటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన రోగులకు ప్రతి 48 గంటలకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. అలా ఇప్పటివరకు కనికాకు నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ అనే తేలింది. తాజాగా ఐదోసారి కూడా అవే ఫలితాలు వచ్చాయి.
మరోవైపు సోషల్ మీడియాలో కనికా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఆమె కొట్టిపారేశారు. తన ఆరోగ్యం సీరియస్‌గా ఉందని, తనని ఐసీయూలో ఉంచారని వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రస్తుతం కనికా కపూర్‌కు ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స అందుస్తున్నారు. కనికా కపూర్ ఇండియాకు వచ్చినప్పుడు ఆమెను సెల్ఫ్ క్వరెంటైన్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించినప్పటికీ ఆమె వినకుండా పలువురు ప్రముఖులను కలవడం, ఆ తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ రావటంతో ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను కలిసిన ప్రముఖులంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.