జై శ్రీరామ్.. తెలుగైట్స్ పాఠకులందరికీ ముందుగా శ్రీ రామ నవమి శుభాకాకంక్షలు. ఈ కథనంలో శ్రీరామ నవమి వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం..
చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ చంద్ర మూర్తి అవనిపై జన్మించిన రోజు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముని జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలనే ‘శ్రీరామ నవమి’ వేడుకలు అనికూడా అంటారు. మానవ రూపంలో జన్మించి, తన ఆదర్శాలతో భగవంతునిగా కొనియాడబడిన ఏకైక వ్యక్తి మన శ్రీరామ చంద్ర మూర్తి.
రాక్షస రావణ సంహారం చేసి మానవాళిని సంరక్షించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో శ్రీరామునిగా అవతారం ఎత్తాడు. భగవంతుని దశావతారాల్లో ఇది ఏడవ అవతారం. శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు మధ్యాహ్నం 12గంటలకు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించారు. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా శ్రీరామ చంద్ర మూర్తి జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమిగా జరుపుకుంటూ వస్తున్నాం.
అసలు శ్రీరామ జన్మదినాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి? మానవ ఖ్యాతిని, మనుగడను బ్రతికించడం కోసం నర రూపంలో పుట్టిన వ్యక్తి శ్రీరాముడు. శ్రీరాముని కాలంలో మానవులను తక్కువగా చూసేవారు అసురులు, అసురుల ధాటికి మానవాళి మనుగడే కష్టంగా ఉండే రోజులవి. రాక్షసాధిపతి రావణుడు బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని సురులు, అసురుల నుంచి తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందాడు.
రావణునికి మానవులంటే చాలా చులకన భావం ఉండేది, అదే భావంతో బ్రహ్మను వరం కోరినప్పుడు బ్రహ్మ మానువుల ప్రస్థావన తీసుకొని రాగా, మానవులు తనకు గడ్డిపోచతో సమానమని, వారి నుంచి తనకు ఎలాంటి ప్రాణహాని లేదని ప్రగల్భాలు పలికాడు. కానీ సాక్షాత్తూ మహావిష్ణువే మానవునిగా అవతారమెత్తిన విషయాన్ని రావణుడు గ్రహించలేకపోయాడు.
రావణుడు చులకన చేసిన మానవ, వానర, భల్లుకాది జాతులని సంస్కరించి, ఉద్ధరించి వారికి కూడా గౌరవమైన ప్రతిపత్తి కలిగేట్టు చేశాడు మన శ్రీరాముడు. తన నడవడికతో, పరిపాలనా సామర్థ్యంతో యావత్ మానవాళికే కాకుండా సుర లోకానికి కూడా ఆదర్శంగా నిలిచాడు మన శ్రీరాముడు. ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తూ, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. రాముని పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు.
ఓ తల్లికి ఉత్తమ కుమారునిగా, ఓ తమ్ముడికి ఉత్తమ సోదరుడిగా, ఓ గురువుకు ఉత్తమ శిష్యుడిగా, ఓ భార్యకు ఉత్తమ భర్తగా, బిడ్డలకు ఉత్తమ తండ్రిగా, తనని నమ్మిన వారికి ఉత్తమ మిత్రునిగా, ప్రజలకు ఉత్తమ రాజుగా ఇలా జీవితంలో ప్రతి వ్యక్తికి, పాత్రకు ఆదర్శంగా నిలిచారు శ్రీరామ చంద్ర మూర్తి. ఎవరితో ఏవిధంగా నడుచుకోవాలో సమాజానికి నేర్పిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ఎవరైనా మంచి వ్యక్తిని మనం శ్రీరామ చంద్రునితోను, మంచి పాలనను రామ రాజ్యం తోనూ పోలుస్తూ ఉంటాం.
మానవ రూపంలో అవతరించిన భగవంతుడు, అందరికీ ఆదర్శ పురుషుడు కాబట్టే ప్రతి ఏటా మనం శ్రీరామ నవమి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. మనం కూడా శ్రీరామునిలా మంచి బుద్ధులతో ఇతరులకు ఆదర్శంగా నిలుద్దాం.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||