బోసిపోయిన బుచ్చి; ఒంటరైన మా రాముడు

మా ఊర్లో (బుచ్చిరెడ్డి పాళెం) శ్రీరామ నవమి వస్తుందంటే చాలు నాకెందుకో చెప్పలేనంత సంతోషం. శ్రీరామ నవమి వస్తూనే వేసవి సెలవులను కూడా వెంట తీసుకువస్తుంది. ఈ జాతరలో చుట్టు ప్రక్కల ఊర్ల నుంచి వచ్చే మా బంధువులు కనిపిస్తారు, స్కూల్ నుంచి విడిపోయిన పాత మిత్రులు కలుస్తుంటారు. మా ఊర్లో శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. నగరంలోని అన్ని రకాల దుకాణాలు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. ఇక నగరంలోని ఇళ్లయితే, బంధువుల సందడితో కళకలలాడుతూ కనిపిస్తాయి.

మేం ఈ వేడుకలను ‘బుచ్చి తిరుణాల’గా పిలుచుకుంటాం. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ తిరుణాల వేడకల్లో మా ఊరి కోదండ రాముడు మునుపెన్నడూ లేనంత ముస్తాబుగా కనిపిస్తాడు. నిత్యకైంకర్యాలతో ప్రతిరోజూ ఏదో ఒకరకం వాహనంపై ఊరేగుతూ ఊరి ప్రజలను ఆశీర్వదిస్తూ ఉంటాడు మా సీతారాముడు. మా రామునికి చేసే వాహన సేవల్లో తేరు (రథం), తెప్ప (పడవ) ఉత్సవాలు ఎంతో ప్రాచుర్యమైనవి. ఈ రెండు వాహన సేవలు చూడటానికి, అందులో భాగమవ్వటానికి మారుమూల ప్రాంతాల నుంచి సైతం ఎంతో మంది భక్తులు వస్తారు.

ఈ వేడుకల సమయంలో ఇసుక వేస్తే రాలనంత జనం గుమికూడుతారు. ఓపక్క మైకుల్లో జేబు దొంగలున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించే పోలీసులు, మరోపక్క రండి రండి బాబు రండి అంటూ పిలిచే దుకాణదారులు భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ జాతర వాతావరణం.

పానీపూరీ బండ్లు, చాట్ మసాలా బండ్లు, బొరుగుల మిక్చర్ బండ్లు, ఫ్రైడ్ రైస్/నూడిల్స్ దుకాణాలు, ఐస్‌క్రీం అంగళ్లు, గాజుల దుకాణాలు, స్టీల్ సామాన్ల అంగళ్లు, చెప్పుల షాపులు, వేడి వేడి జిలేబీలు, ఘరం ఘరం పకోడీలు, చిన్న పెద్ద రంగులు రాట్నాలు, బెలూన్లను కాల్చే దుకాణాలు, రింగులు వేసే అంగళ్లు అబ్బో మా తిరుణాలలో పెట్టే దుకాణాల జాబితా చాంతాడంత ఉంటుంది. ఈ దుకాణాలు రామాలయానికి ఇటు చివరన ఉన్న శివాలయం దగ్గర నుంచి ప్రారంభమై రామాలయం ముఖ ద్వారం వరకూ ఉంటాయి (దాదాపు ఒక కిలోమీటరుకు పైనే).

మేం ఈ తిరుణాల కోసం దాదాపు రెండు నెలల ముందు నుంచే అమ్మ, నాన్న, బంధువులు ఇచ్చే పాకెట్ మనీని దాచుకుంటూ ఉంటాం. ఇలా దాచుకున్న డబ్బుతో తిరుణాలకు వెల్లి బొమ్మలు, తినుబండాలు కొనుక్కుంటాం. ఈ జాతరలో అమ్మే పిండి వంటలు భలే రుచిగా అనిపిస్తాయి. అన్ని రకాల వెరైటీలు మేము ఎప్పుడూ చూసిండము. మైసూర్ పాకులతో మేడలు కడతారు, పంచదార చిలకలతో స్వీట్ షాపులను అలంకరిస్తారు. ఎర్రటి జాంగ్రీలు, గుండ్రటి బాదుషాలు, అటువైపు నడుస్తుంటే ఘుమఘమలాడే కమ్మటి వాసననిస్తుంటాయి. ఆ మిఠాయిలు కొనలేక ఆ వాసనకే కడుపు నింపుకొనే పేదలు ఎందరో.

ఆ చివర లైనులో ఓ అవ్వ వేడి వేడి బఠానీలు, మరమరాలు వేయిస్తూ ఉంటుంది. మరోవైపు బండ్లపై ఖర్జూరపు పండ్లను రాసులుగా పోసి అమ్ముతుంటారు. ఇంకొక వైపు చూస్తే, కర్జూరంతో చేసే హల్వా లాంటి మిఠాయి అమ్ముతుంటారు. లైన్లలో రెండు మూడు పెద్ద బొమ్మల షాపులుంటాయి, ధరలన్నీ ఆకాశంలోనే ఉంటాయి. అలాంటి షాపులు కనిపిస్తే మేం ఎక్కడ మారం చేస్తామోనని వేగంగా నడిపించుకుంటూ తీసుకెళ్లే వారు అమ్మ, నాన్నలు. ఏదైనా చిన్న కొట్టులో బంతులు, గిలకలు, బుడ్డీలు (మీనియేచర్ కుకింగ్ సెట్స్) వంటివి కొనిచ్చి ఇక చాల్లే అనేవారు. పాపం అప్పుడు మాకు తెలియదు అమ్మ నాన్నల దగ్గర ఎక్కువ డబ్బులు లేవని, కానీ ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఆ జ్ఞాపకాలన్నీ ఎంత మధురంగా అనిపిస్తున్నాయో.. తిరిగి ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోవాలనిపించేంతలా..!

బుచ్చిరెడ్డిపాళెంలో ఇప్పటికీ శ్రీరామ నవమి వేడుకలు ఇదే రీతిలో జరుగుతాయి. కానీ, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ మొట్టమొదటి సారి చూస్తున్నా.. మా రాముడు ఒంటరోడయ్యాడు. మమ్మల్నందరినీ వదిలేసి ఒక్కడే ఆలయంలో వేడుక చేసుకుంటున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా మా బుచ్చి తిరుణాల బందయ్యింది. భక్తులు లేక ఆలయం బోసిపోయింది. వ్యాపారం లేక దుకాణదారులు అప్పులపాలయ్యారు. ఆలయంలో మా రాముడొక్కడే ఉన్నాడు, మా రాముడు ఒంటరి వాడయ్యాడు. మా కోదండ రాముని తోడు లేక మేము కూడా ఒంటరి అయిపోయాం..! ఒంటరి అయిపోయాం..!

ఫొటో మూలం: శ్రీ కోదండరామ స్వామి దేవాలయం, బుచ్చి
buchi-temple-3buchi-temple-8buchi-temple-7buchi-temple-6buchi-temple-4buchi-temple-1buchi-temple-2thirunala-1thirunala-2thirunala-3thirunala-4

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s