శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదములు వడపప్పు, పానకం. శ్రీ రామ నవమి రోజున వడపప్పు, పానకంతో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రసాదాల వెనుక కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. శ్రీరామ నవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి పెసరపప్పుతో చేసే వడపప్పు శరీరానికి చలువను చేకూరుస్తుంది. అలాగే మిరియాలతో చేసే పానకం వేసవిలో వచ్చే గొంతు సంబంధిత సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.
మరి శ్రీరాముని ఫేవరేట్ ప్రసాదాలను ఎలా చేయాలో చూద్దాం రండి:
వడపప్పు ప్రసాదం – కావలసిన పదార్థాలు:
పెసరపప్పు – కప్పు
పచ్చిమిర్చి – 1 (సన్నగా తరగాలి)
కొత్తిమీర – రెండు రెమ్మలు (సన్నగా తరగాలి)
పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు
ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పును నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని వడకట్టేసి, వేరొక గిన్నెలోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తమీర, కొబ్బరి తురుము మరియు ఉప్పు వేసి బాగా కలుపుకుంటే వడపప్పు ప్రసాదం తయారైనట్లే.
పానకం ప్రసాదం – కావలసిన పదార్థాలు:
బెల్లం – 3 కప్పులు
మిరియాల పొడి – 3 టీ స్పూన్లు
ఉప్పు – చిటికెడు
శొంఠిపొడి – టీ స్పూన్
నిమ్మరసం – మూడు టీ స్పూన్లు
యాలకుల పొడి – అర టీ స్పూన్
నీరు : 9-10 కప్పులు
తయారు చేసే విధానం : ముందుగా బెల్లాన్ని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ పెద్ద గిన్నెలో 9-10 కప్పుల నీళ్లు పోసుకొని అందులో మెత్తగా చేసుకున్న పొడి బెల్లాన్ని వేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీటిని వేరొక పాత్రలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ద్రావణంలో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకుంటే రామునికి అతి ప్రీతిదాయకమైన పానకం తయారవుతుంది.
Photo Credit: Neeluskitchen