అమెరికాలో గ్రీన్ కార్డు (శాశ్వత నివాస హోదా) పొందాలని, అగ్రరాజ్యంలోనే శాస్వతంగా స్థిరపడిపోవాలని అనేక మంది భారతీయులు కల కంటూ ఉంటారు. అయితే, అలాంటి వారి కలలు కల్లలు కానున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.
రానున్న 2030 సంవత్సరం నాటికి అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేచి ఉండే వారి సంఖ్య ఇప్పుడు దాని కన్నా రెట్టింపు అవుతుందని, అదే గనుక జరిగితే అమెరికాలోని భారతీయులు గ్రీన్ కార్డు కోసం దశాబ్ధాల పాటు వేచి ఉండాల్సి వస్తుందని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆరెస్) నివేదిక వెల్లడిస్తోంది.
ప్రస్తుతం గ్రీన్‌కార్డ్ కోసం ఆమోదం పొంది ఉండి కూడా, పర్మినెంట్ రెసిడెన్స్ కోసం వేచి చూస్తున్న వారు సుమారు 10 లక్షల వరకూ ఉన్నారు. ఇప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే, ప్రతి మూడేళ్లకు ఒకసారి ఒక్కో దేశానికి గ్రీన్ కార్డ్ జారీ పరిమితిని తొలగించి, విదేశీ నిపుణులకు గ్రీన్‌కార్డులను రిజర్వ్ చేస్తారు.
ఉద్యోగ పరంగా చూసినట్లయితే, ఈబీ 1, ఈబీ 2, ఈబీ 3 కేటగిరీలలో జారీచేసే గ్రీన్కార్డ్ల సంఖ్య 1,20,120 పరిమితిని పెంచరు. అమెరికాలో సవరించబడిన ఎస్ 386 చట్టం ప్రకారం వివిధ దేశాలకు ఏడు శాతం కోటా కేటాయింపును తొలగిస్తే నిరీక్షిస్తున్నవారిలో భారత్, చైనా దేశాల వారికి స్వల్ప కాలపరిమితి తగ్గే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో 2030 సంవత్సరం నాటికి ఈబీ 1 బ్యాక్లాగ్ సంఖ్య 1,19,732 నుంచి 2,68,246కి, ఈబీ 2 బ్యాక్లాగ్ సంఖ్య 6,27,448 నుంచి 14,71,360కి మరియు ఈబీ3 బ్యాక్లాగ్ సంఖ్య 1,68,317 నుంచి 4,56,190కి పెరుగనుంది. మొత్తంగా చూసుకుంటే.. రానున్న పదేళ్లలో ఈబీ 1, ఈబీ 2, ఈబీ 3 కేటగిరీలలో గ్రీన్ కార్డుల కోసం వేచి ఉండే వారి సంఖ్య 9,15,497 నుంచి 21,95,795 లకు పెరుగనుంది.
వివిధ దేశాలకు ఏడు శాతం కోటా కేటాయింపును తొలగించేలా సవరించిన చట్టం ఎస్ 386ని అమలు చేసినప్పటికీ గ్రీన్‌కార్డుల జారీలో నిరీక్షణ కాలపరిమితి స్వల్పంగానే తగ్గుతుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం వేచి ఉన్న వారిలో హెచ్-1బీ వర్క్ వీసా మీద వచ్చిన ఈబీ 2, ఈబీ 3 కేటగిరీలలోని భారతీయ ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నారని, వీరికి గ్రీన్‌కార్డు రావాలంటే దశాబ్దాల పాటు నిరీక్షించక తప్పదని కాంగ్రెస్ నివేదిక చెబుతోంది.