ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు లైట్లన్నీ ఆర్పేద్దాం..
9 నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం..
మరోసారి ఐక్యతను చాటుదాం..
కరోనా చీకట్లను పారద్రోలుదాం..!
– ప్రధాని మోదీ పిలుపు
ప్రస్తుతం భారతదేశంలో యుద్ధం లాంటి పరిస్థితి నెలకొని ఉందని, కరోనాతో చేస్తున్న ఈ యుద్ధంపై పోరాడేందుకు ప్రజలంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనాను జయించేందుకు దేశమంతా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైందని ఈవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
కరోనాపై విజయం సాధించేందుకు భారత ప్రజలంతా మరోసారి సంకల్పం చాటాలని, ఇందులో భాగంగా ఏప్రిల్ 5 (ఆదివారం)వ తేదీ నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆర్పేసి, దీపాలు లేదా ఫ్లాష్లైట్లను వెలిగించాలని తద్వారా కరోనా చీకట్లను తరిమికొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిది రోజుల పాటు పాటిస్తున్న లాక్డౌన్ చాలా వరకూ సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు.
ఇలా దీపాలు వెలిగించేటప్పుడు, ఫ్లాష్ లైట్లను ఆన్ చేసినప్పుడు తప్పనిసరిగా సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించాలని మోదీ కోరారు. ఇలా చేయటం వలన దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు మరోసారి కరోనాను పారదోలేందుకు తమ సంకల్పం చాటినట్లు అవుతుందని, ప్రజలు వెలిగించే దీపాలు కరోనాపై పోరాడే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాలని ప్రధాని ఆకాంక్షించారు.