కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో, మద్యం దొరక్క మందు బాబులు దొంగలుగా మారిపోతున్నారు. వైన్ షాపులకు కన్నాలు వేసి మద్యం దోచుకెళ్తున్నారు. దేశంలో ఇప్పటికే ఈ తరహా ఘటనలు చాలానే నమోదు కాగా, తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలంలో పిడూరు గ్రామానికి వెళ్ళే రహదారిలో వున్న వైన్ షాపులో దొంగలు పడ్డారు. అసలే లాక్డౌన్, ఆపై రాత్రివేళల్లో కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఇదే అదనుగా చేసుకున్న మందు బాబులు రాత్రికి రాత్రి వైన్ షాపుకు కన్నం పెట్టి అందినంత మద్యం దోచుకెళ్లిపోయారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకట్రామిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలోనే మొట్టమొదట కరోనా కేసు నెల్లూరులో నమోదు కాగా, ఇప్పు ఇదే జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కెల్లా అత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా నుంచి 253 శాంపుల్స్ ల్యాబ్‌కు పంపగా వాటిలో 32 పాజిటివ్, 21 నెగటివ్ వచ్చాయి, ఇంకా 178 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది.