దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఈనెల 24వ తేదీన దేశంలోని 18 స్థానాలకు జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడటం ఇది రెండోసారి.
నిజానికి ఏప్రిల్ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను గత నెల 26వ తేదీనే జరపాల్సి ఉన్నప్పటికీ కమ్ముంకుటున్న కరోనా వైరస్, దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న ఈ ఎన్నికలను వాయిదావేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.
దేశంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగకపోవటంతే, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం మరికొన్ని రోజుల పాటు ఈ ఎన్నికలు వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని ఈసీ వివరించింది. కాగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు గాను 37 స్థానాల్లో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తి కాగా మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.