బెండకాయ చాలా జిగురుగా ఉంటుంది. దీనిని మాములుగా ఫ్రై చేయటానికి చాలా సమయం పడుతుంది. అందుకే సమయాన్ని ఆదా చేసుకుంటూనే కరకరలాడే కమ్మటి బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం రండి.
కావలసిన పదార్థాలు:
లేత బెండకాయలు – అరకిలో
పల్లీలు (వేరుసెనగ పప్పులు) – 50 గ్రాములు
ఎండు మిర్చి – 3 లేదా 4 (కారానికి సరిపడా)
ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర (జీరా) – అర టీ స్పూన్
దబ్బ మినప్పప్పు – అర టీ స్పూన్
ఆవాలు – పావు టీ స్పూన్
పసుపు – చిటికెడు
ధనియాలపొడి – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – కొంచెం
తయారు చేసే విధానం:
ముందుగా బెండకాయల్ని కడిగి శుభ్రం చేసి, సన్నటి ముక్కలుగా తరిగి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నటి మంటపై పల్లీలు (వేరు సెనగప్పపు), ఎండు మిర్చి మరియు కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి (ఈ మూడింటినీ కూడా మాడిపోకుండా సన్నటి మంటపై మాత్రమే ఫ్రై చేయాలి).
ఇప్పుడు పొయ్యి మీద ఓ మూకుడు పెట్టి, కొద్దిగా నూనె వేసి అందులో దబ్బ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇదే మిశ్రమంలో వేయించిన పల్లీలు, ఎండు మిర్చి, కరివేపాకులను పొడిగా నలుపుకోవాలి.
ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలు, కొబ్బరి పొడి మరియు ధనియాల పొడిని వేసి అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు ఇందులో కాస్తంత కారంపొడిని కూడా వేసుకోవచ్చు. ఇదంతా సన్నటి మంటపైనే చేసుకోవాలి, లేదంటే ఫ్రై మాడిపోయే ప్రమాదం ఉంది.
ఇలా డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రైని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. మరి కరకరలాడే ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేస్తారు కదూ..!