ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగి మర్కజ్ ముస్లింల కారణంగానే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన జగన్ కరోనా వైరస్‌కు కులం, మతం, ప్రాంతం, పేద, ధనిక భేదాలు లేవని అది ఎవ్వరికైనా వ్యాపించవచ్చని అన్నారు.
కరోనా వైరస్‌కు మతం పేరు అంటగట్టి తప్పుడు ప్రచారం చేయవద్దని, కరోనా బాధితులను చులకనగా చూడొద్దని అన్నారు. కరోనా బాధితులపై ప్రజలను ప్రేము చూపాలే తప్ప, వారేదో తప్పు చేసిన వారుగా చూడకూడదని, మన వాళ్లని మనమే వేరుగా చూడకూడదని, భారతీయులమంతా ఒక్కటిగానే ఉండాలని అన్నారు.
ఆదివారం దీపాలు వెలిగించండి: జగన్
ప్రధానమంత్రి పిలుపు మేరకు చీకటిని నింపుతున్న కరోనాను తరమడానికి ప్రజలందరూ దీపాలు వెలిగించాలని జగన్ కోరారు. కంటికి కనిపించని మహమ్మారితో మనమంతా పోరాడుతున్నామని, ఈ పోరాటంలో భారతీయుల సమైఖ్యతను చాటేలా ఆదివారం రాత్రి 9 గంటలకు కుల మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరూ దీపాలు వెలిగించాలని ఆయన కోరారు.