ప్రపంచ వ్యాప్తంగా మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు జంతువులను కూడా వదలడం లేదు. మనుషుల్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ తాజాగా ఓ పులికి సోకింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న బ్రాంగ్జ్ జూలో ఓ పులికి కరోనా వైరస్ సోకింది. అసలే న్యూయార్క్ నగరంలో కరోనా విళయతాండం చేస్తోంది.
జూలో ఉన్న పులి పదేపదే దగ్గుతుండటంతో, అనుమానం వచ్చిన అధికారులు పులికి కరోనా టెస్టు చేశారు, ఈ టెస్టులో పులికి కరోనా పాజిటివ్ రావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు పులికి ఎవరి ద్వారా ఈ వైరస్ సోకిందనే విషయపై జూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ పులి పేరు నదియా, దాని వయస్సు నాలుగేళ్లు. ప్రపంచంలోనే కోరనా సోకిన తొలి పులి ఇది. నదియా పులితో పాటుగా అదే జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు. ఈ మృగరాజులు కూడా అనారోగ్యంతో బాడపడుతున్నాయని, జూలో ఓ ఉద్యోగికి కరోనా సోకిందని, తన ద్వారానే ఇతర జంతువులకు కూడా కరోనా సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.