దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్ కారణంగా మందు బాబులు ఇప్పుడు మందు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. చుక్క దొరక్క కొందరు పిచ్చోళ్లవుతుంటే, మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెర తీశారు.
సైబర్ నేరగాళ్ల టార్గెట్ ఇప్పుడు మందు బాబులే. మద్యానికి బానిసై ఈ లాక్డౌన్ సమయంలో ఎలాగైనా మందు సంపాధించాలనే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు తమ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని ఫేమస్ బగ్గా వైన్స్ పేరును వాడుకొని, ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే, అర్థగంటలో మీ ఇంటికి మద్యం పంపిస్తామంటున్నారు.
ఇందులో భాగంగా, విక్టిమ్లకు ఓ క్యూఆర్ కోడ్‌ను పంపించి, ఆ అకౌంట్‌కు మొబైల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఆ తర్వాత అర్థగంటకు మందు మీ ఇంటికి పంపిస్తామంటూ మెసేజ్‌లు పెడుతారు. ఇటీవలే హైదరాబాద్, గౌలిపురాకి చెందిన రాహుల్ అనే బాధితుడు ఈ విధంగా రూ.51,000 చెల్లించి, చివరకు ఇంటికి మద్యం రాకపోవటం పోలీసులను ఆశ్రయించాడు.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బగ్గా వైన్స్ కూడా తమ పేరును ఆన్లైన్ నేరగాళ్లు వాడుకుంటున్నారని ఇదివరకే ఓ పోలీసు కంప్లైంట్‌ను కూడా ఫైల్ చేయటం గమనార్హం.