కనికా కపూర్‌కు కరోనా తగ్గిపోయింది!
గత కొద్ది రోజులుగా కరోనా వైరస్సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు ఈ మహమ్మారిని జయించారు. ఆరవసారి నిర్వహించిన కరోనా టెస్టులో ఆమెకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో, ఆమె ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
కరోనా వైరస్ నుంచి కనికా కోలుకున్నప్పటికీ, మరికొన్నిరోజుల పాటు ఆమె ఇంటిలోనే స్వీయ నిర్బంధం చేసుకోవాలని, తన ఇంటి సభ్యులకు దూరంగా ఉండడంతో పాటు, తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె రెండు వారాల పాటు ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుల ఉన్నారు.
కనికా కపూర్ మార్చి 9న లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. లండన్ నుంచి రాగానే స్వీయ నిర్బంధం చేసుకోకుండా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని హోటల్లో బస చేసింది. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలిసింది. అనతంరం అస్వస్థతో ఆస్పత్రిలో చేరగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఆ తర్వాత కనికా కపూర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం విషయంలో వస్తున్న వదంతులపై కనికా గతంలో ఓ ట్వీట్ ద్వారా తన ఆరోగ్యం కుదురుగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని చెప్పిన విషయం తెలిసినదే.