భారతదేశంలో కరోనా మహమ్మారి చాప క్రింద నీరులా విస్తరిస్తున్న నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ను ఏప్రిల్ 14 తర్వాత కూడా పొడిగించాలని ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఈ విషయంపై ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీసం ఒక వారం నుంచి రెండు వారాల వరకైనా లాక్డౌన్ను పొడిగించాలని కేసీఆర్ అన్నారు. కరోనాపై వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పెద్ద పెద్ద దేశాలే కరోనా ధాటికి తట్టుకోలేక పోతున్నాయని, మనదేశంలో పరిస్థితులు చక్కబడాలంటే మరికొన్ని రోజుల పాటు లాక్డౌన్ను పొడగించడం తప్ప మనకు వేరే మార్గం లేదని అన్నారు. బోస్టన్ నివేదిక కూడా దేశంలో జూన్ 3వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలని పేర్కొందని కేసీఆర్ గుర్తు చేశారు. లాక్డౌన్ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.