ఈ మెగా హీరో ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న మెగా హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఈయనే మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన చిన్ననాటి ఫొటో ఇది. చిరంజీవికి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. తన ఇష్ట దైవం పుట్టిన రోజైన నేడు, హనుమ జయంతిని పురస్కరించుకొని తన జీవితంలో జరిగిన కొన్న సంఘటనలు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.

అందులో భాగంగా తన చిన్ననాటి ఫొటోను, ప్రముఖ చిత్రకారుడు బాపు గారు గీసిన చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసి వాటితో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. అందేంటో చిరంజీవి మాటల్లోనే మీరు తెలుసుకోండి..!

“ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?

ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో.

chiru

కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద రీప్రొడ్యూస్ చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …?

బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి… బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి… అలానే ఉంచేసాను… మార్చలేదు” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

chiru-hanuman