సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పుట్టే శిశువులకు కొందరు వెరైటీగా ఆ వైపరీత్యానికి తగ్గట్లుగా పేర్లు పెడుతుంటారు. అదే ట్రెండ్‌తో ఇప్పుడు కరోనా సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా కుమార్, కరోనా కుమారి అనే పేర్లను పెట్టారు. ఈ సంఘటన మన ఆంధ్రప్రదేశ్‌లోనే చోటు చేసుకోవటం మరీ విడ్డూరం.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేంపల్లె పట్టణంలో పుట్టిన ఇద్దరు చిన్నారులకు ఈ పేర్లను పెట్టారు. అలిరెడ్డి పల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి జన్మించింది. వైద్యులు అబ్బాయికి కరోనా కుమార్ అని, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లను సూచించారు. ఆ పేర్లకు వాళ్ల తల్లిదండ్రులు కూడా ఆమోదం తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఓ సంఘటనే చోటు చేసుకుంది. యూపీలోని డియోరియా జిల్లాలో జన్మించిన బాబుకు ‘లాక్డౌన్’ అనే పేరును పెట్టగా, ఘోరక్‌పూర్‌లో జనతా కర్ఫ్యూ రోజును జన్మించిన ఓ అమ్మాయి ‘కరోనా’ అనే పేరును పెట్టారు.