కరోనాకు పుట్టినిల్లు అయిన వూహాన్ నగరంలో ఇప్పుడు సాధారణ జనజీవన పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా విషయంలో ఉన్న దాదాపు అన్ని ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో చైనాలో మళ్లీ కోలాహలం నెలకొంది. కానీ మరికొన్నాళ్ల పాటు చైనాలో ప్రతి ఒక్కరు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం మాత్రం తప్పనిసరి చేశారు.
దుకాణాలు, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు ఇలా సర్వం తెరచుకున్నాయి. ప్రజా రవాణా యధాస్థితికి వచ్చింది. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లుగా తమ బంధువులను మిస్ అయిన చైనా వాసులు ఇప్పుడు వారిని కలవటం కోసం ప్రయాణాలు ప్రారంభించారు. చైనాలో కరోనా మరణాలు పూర్తిగా తగ్గాయి.
దేశంలో ఎక్కడా కూడా కొత్త కోవిడ్-19 మరణాలు నమోదు కాలేదని చైనా ప్రకటిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రకటన రావడం ఇదే తొలిసారి. చైనా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్ 7 నాటికి, మొత్తం 81,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,331 మంది చనిపోయారు.