అగ్రరాజ్యాల్లో ఉన్న ఐటి కంపెనీలను తెలుగు తేజాలు పాలిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచ్చాయ్, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి మనకు తెలిసినదే. కాగా.. తాజాగా.. అమెరికన్ ఐటి దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా మన తెలుగు తేజం అరవింద్ కృష్ణ బాధ్యతలు స్వీకరించారు.
ఇదివరకటి ఐబిఎం సీఈఓ గిన్నీ రోమెట్టి స్థానాన్ని అరవింద్ కృష్ణ చేజిక్కుంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన అరవింద్ కృష్ణ ఐఐటీ కాన్పూర్లో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ పట్టా పొందారు.
అరవింద్ కృష్ణ 1990లో ఐబిఎం కంపెనీలో చేరారు, అప్పటి నుంచి వివిధ పొజిషన్లలో ప్రమోట్ అవుతూ ఇప్పుడు కంపెనీ పగ్గాలనే తన చేతిలోకి తెచ్చుకున్నాడు. కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారు.