తల్లి ప్రేమకు నిదర్శనం పట్టే ఎన్నో సంఘటనలను మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తన బిడ్డల కోసం తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు, ఆపద వస్తే అయిన వాళ్లయినా ఆమడ దూరంలో ఉంటారేమో కానీ తల్లి మాత్రం వేటిని లెక్కచేయకుండా బిడ్డల కోసం పరుగులు తీస్తుంది. అలాంటి ఓ సంఘటనే తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా వచ్చి పడిన లాక్డౌన్ ఆ తల్లి బిడ్డలను వేరు చేసింది. కొడుకు 700 కిలోమీటర్ల అవతల చిక్కుకుపోయాడని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది. పోలీసులను అర్ధించి, అనుమతి పత్రాలు తీసుకొని కొడుకు వద్దకు స్కూటర్‌పై పయనమైంది. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 12 ఏళ్ల క్రితం భర్త మరణించడంతో ఒంటరిగా పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్నకొడుకు మహ్మద్ నిజాముద్దీన్‌కి డాక్టర్ చేయాలని ఆసక్తి ఉండడంతో అతడికి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ ఇప్పిస్తోంది. నిజాముద్దీన్ స్నేహితుడు నెల్లూరులో ఉండడంతో మార్చి 12న అక్కడికి వెళ్లాడు. ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్ కారణంగా అక్కడే నెల్లూరులో చిక్కుకుపోయాడు.
స్నేహితుడి వద్ద కుమారుడు సురక్షితంగానే ఉన్నప్పటికీ, నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, వస్తున్న వదంతులు విని ఆమె మనసు ఆగలేదు. దీంతో ఆమె బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ఆయన ఇచ్చిన పర్మిషన్ లెటర్ తీసుకుని 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు స్కూటీపై సోమవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ అదే స్కూటీపై బుధవారం మధ్యాహ్నానికి బోధన్ చేరుకున్నారు.
కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలనే తపనే తనను కరోనా, లాక్డౌన్లు ఆపలేకపోయాయి. ఈ 1400 కిలోమీటర్ల దూరంలో అడుగడునా పోలీస్ చెక్‌పోస్టులు ఉన్నాయి. ప్రతిచోటా ఆపుకుంటూ, అక్కడి పోలీసులకు తన గోడు వినిపించుకుంటూ ఆటంకాలన్నింటినీ దాటుకొని కొడుకును చేరుకుంది. తన పరిస్థిని అర్థం చేసుకుని, బిడ్డను చేరుకోవాటనికి అనుమతించిన పోలీసులందరికీ ఆమె పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంది.