కరోనా సోకి వ్యక్తులు ప్రాణాలు కోల్పోతుంటే, వైరస్ తమకు ఎక్కిడ సోకిందోనని భయపడి ప్రాణాలు తీసుకునే వారు కూడా పెరుగుతున్నారు. తాజాగా.. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు కూడా కరోనా సోకిందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలోని చెహిడి ప్రాంతంలో ఉంటున్న ప్రతిక్ రాజు కుమావత్ అనే 31 ఏళ్ల వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరీ తన ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తనకు కరోనా వచ్చి ఉండవచ్చేమోనని, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు.
ప్రతిక్ గొంతు సంబంధిత సమస్యతో ఓ ప్రైవేటు డాక్టరును సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, అతనికి కరోనా టెస్టులు మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలో తనకు కరోనా సోకిందేమోనన్న భయంతోనే ప్రతిక్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, చనిపోయిన ప్రతిక్ శాంపిల్స్‌ను ప్రస్తుతం కరోనా టెస్టుల నిమిత్తం సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.