లాక్డౌన్ విషయంలో అనుకున్నట్లుగానే అయింది. తెలంగాణాలో కూడా లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకూ పొడగిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులపై ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర మంత్రివర్గంతో చర్చలు జరిపిన కేసీఆర్ శనివారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
కరోనా వ్యాప్తి కట్టడికి లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదని, ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎక్కడిక్కడే ఇళ్లలోనే ఉండిపోవాలని, ప్రజలను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి సొంత ఊర్లకు పంపడానికి ప్రత్యేక అనుమతులు ఏవీ జారీ చేయడం లేదని అన్నారు.
ప్రజలందరూ సంయమనం పాటించి, అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలంతా దయచేసి మన క్షేమం, మన భవిష్యత్తు కోసం పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు కుల మతాలకు అతీతంగా కలసికట్టుగా కరోనా మహమ్మారని తరిమికొట్టాలని, ఈ సమయంలో ప్రజలెవరూ సామూహిక ప్రార్థనలు చేయొద్దని సూచించారు.
ఈ రెండు వారాలు ఓపిక పడితే, కరోనా భారత్ నుంచి పారిపోయే అవకాశం ఉందని, ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్డౌన్ను ఎత్తేస్తామని చెప్పారు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 1 నుంచి 9 వ తరగతి వరకూ విద్యార్థులందరినీ నేరుగా పైతరగతులకు పంపిస్తామని, పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.