కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ రేపటి (ఏప్రిల్ 14)తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడగిస్తారా లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే లాక్డౌన్ పొడగింపు ఉంటుందా అనే విషయంపై నేడు ఓ స్పష్టత వచ్చే అకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్‌బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా విభజించి, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే లాక్డౌన్ ఆంక్షలు పరిమితం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని, వారి సూచనలు సలహాలను కేంద్ర అధికారులతో సమీక్షించి ఓ లాక్డౌన్ పొడగింపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లాక్డౌన్ పొడగించడమే మంచిదని ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నేటి ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.