భారత్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3, 2020వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈనేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ కూడా మే 3 వరకూ భారతదేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
దీంతో ఏప్రిల్ 14 తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని, ఆ తర్వాత రైళ్లలో తమ స్వంత ఊర్లకు వెళ్ల వచ్చు అనుకునే వారి కల కలగానే మిగిలిపోయింది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ 2020 మే 3 వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్లో వెల్లడించింది.
అయితే, ఈ లాక్డౌన్ పొడగింపు సమయంలో గూడ్స్ రైళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పాలు, నిత్యావసర వస్తువులు, వైద్య పరికరాలు ఇతర సరుకులు రవాణా కోసం మాత్రమే రైలు సేవలను వినియోగించనున్నారు. ప్యాసింజర్ రైళ్లు రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 14 తర్వాత టికెట్లను బుక్ చేసుకున్నవారికి రీఫండ్ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు.