విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది వేసిన జార్జి రెడ్డి గురించి చాలా మందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల వచ్చిన జార్జి రెడ్డి సినిమా పుణ్యమా అని కొత్త తరానికి సైతం మన జార్జి రెడ్డి గురించి తెలిసేలా చేయగలిగారు చిత్ర నిర్మాతలు.
సమాజంలోని వ్యవస్థీకృత దోపిడీ, వివక్షత, ఆధిపత్యాలను నయం చేసే విప్లవ విద్యార్థి ఉద్యమానికి తెరలేపిన వాడు మన జార్జి రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కమ్మేసిన కారు మబ్బులను చీల్చుకుంటూ.. మతోన్మాదం, అరాచకత్వం, అగ్రవర్ణాల ఆధిపత్యాలపై పంజా విసిరాడు జార్జి రెడ్డి.
జార్జి రెడ్డి 1947 జనవరి 15న కేరళలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం తమిళనాడుకు మారింది. మరికొంత కాలానికి అమ్మ లీలా వర్గీస్, నాన్న రఘునాథ రెడ్డిలు వృత్తిరీత్యా ఈ తెలుగు నేలపై కాలు మోపాల్సి వచ్చింది. యూనివర్సిటీలో బాగా చదివి డాక్టర్ కావాలన్న జార్జి రెడ్డి కల ఉన్మాదుల కత్తులకు బలైపోయింది.
జీనా హై తో మర్నా సీఖో! కదం కదం పర్ లడ్నా సీఖో!! ‘బ్రతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అనే నినాదంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్లో చైతన్యం తీసుకు వచ్చిన జార్జి రెడ్డిని విద్యార్థులంతా ముద్దుగా‘హైదరాబాదు చేగువేరా’గా పిలిచుకునే వారు.
విద్యార్థులకు అండగా నిలుస్తూ, యూనివర్శిటీ విద్యార్థులపై ఆధిపత్యం సాగిస్తున్న ఉన్మాదపు మూకలతో నిత్యం పోరాటం చేస్తూ దినదిన గండంగా జీవించేవారు జార్జి రెడ్డి. విద్యార్థుల్లో జార్జి రెడ్డి ఇచ్చిన చైతన్యంతో బడుగు బలహీన విద్యార్థుల విషయంలో అప్పటి వరకు వారిపై ఉన్నతవర్గ విద్యార్థులు చూపించే ఆధిపత్యానికి, ఆగడాలకు అడ్డుకట్టపడినట్లయింది.
యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన జార్జి రెడ్డిని మట్టు పెట్టడానికి ఉన్మాద మూకలు ఎత్తు వేశాయి. అతడ్ని చంపేస్తే కానీ తమ ఆటలు సాగవని భావించిన ఉన్మాదులు జార్జి రెడ్డిని అతి కిరాతంగా కత్తులతో పొడిచి చంపేశారు. జార్జి రెడ్డి ఏప్రిల్ 14, 1972న అతి చిన్న వయస్సులోనే (25 ఏళ్లకే) ప్రాణాలు విడిచాడు.
జార్జి రెడ్డి భౌతికంగా మనతో లేకపోయినప్పటికీ, విద్యార్థుల ఆలోచనల్లో, భావాల్లో సజీవంగానే ఉంటాడు. అతని నినాదాలు ఇప్పటికీ మన చెవుల్లో వినిపిస్తూ ఉంచాయి. అతని ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ మన కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది. జార్జి రెడ్డి చనిపోయి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ ఉద్యమ వీరుడ్ని స్మరించుకుంటూ.. జోహార్ జార్జి రెడ్డి… జోహార్ జార్జి రెడ్డి…!