దొంగల్లా సొంతూర్లకు వెళ్లే పరిస్థితి

కరోనా మహమ్మారి కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ సొంతూర్లకు దొంగల్లా వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జనతా కర్ఫ్యూ ముగిసిన తర్వాత రోజే ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించడం ఆ తర్వాత నేడు మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

దీంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే, హైదరాబాద్‌ నుంచి విజయనగరం జిల్లాకు నిత్యావసర సరకులు రవాణా చేస్తున్న రెండు వాహనాల్లో సుమారు 31 మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

ఈ వాహనాలు సోమవారం అర్ధరాత్రి దాటాక జిల్లాలోకి ప్రవేశించి గజపతినగరం చేరుకున్నారు. కాగా.. పోలీసుల తనిఖీలో అనుమానం వచ్చి వాహనాలను పూర్తిగా తనిఖీ చేయగా వీరంతా బయటపడ్డారు. ఇతర చెక్ పోస్టులలో వీరెలా తప్పించుకున్నారనేది గమనార్హం.

కాగా.. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్న పార్వతీపురం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. వీరంతా పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. సరుకులు రవాణా చేస్తున్న రెండు వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.