ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే3వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏప్రిల్ 20 వరకూ చాలా కీలకమైన రోజులని, ఈ తేదీ వరకూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉండబోతున్నాయని సున్నితంగా హెచ్చరించారు.
దేశంలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పూర్తిస్థాయిలో అమలు చేసినట్లయితే, కరోనా దూకుడుకి కళ్లెం వేయవచ్చని భావిస్తున్నారు. కాగా.. ఏప్రిల్ 20 తర్వాత ఈ లాక్డౌన్ విషయంలో కాస్తంత సడలింపులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని ఇప్పటికే గుర్తించబడిన కరోనా హాట్స్పాట్ (కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే) ప్రాంతాలు మినహా గ్రీన్ జోన్ (కరోనా లేని ప్రాంతాల)లో లాక్డౌన్ సడలింపులు చేయాలని కేంద్ర యోచిస్తోంది.
ఈ సడలింపులపై మరో వారం రోజుల్లో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గ్రీన్ జోన్లలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేలా లాక్డౌన్ను పూర్తిస్థాయిలో పాటించేలా కఠిమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజలు ఇప్పటి వరకూ అందించిన సహకారం మరువలేనిదని, ఇకపై కూడా ఇలాంటి సహకారాన్నే అందించాలని మోదీ కోరారు. మరికొద్ది రోజుల్లోనే దేశం పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటుందని అన్నారు.