అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనాను సమర్థిస్తోందన్న నెపంతో అమెరికా నుంచే విడుదల చేసే నిధులను నిలిపివేస్తామని గతంలో బెదిరించిన ట్రంప్ ఇప్పుడు ఇదే పని చేసి చూపించారు.
అమెరికా నుంచి డబ్ల్యూహెచ్ఓ సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు ట్రంప్. కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ పూర్తిగా విఫలమైందని, తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ కావాలనే కప్పిపుచ్చిందని ట్రంప్ ఆరోపించారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ చైనాను వెనకేసుకొస్తుందని ట్రంప్ అనేక సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసినదే.
ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో డబ్ల్యూహెచ్ఓకి భారీ షాక్ తగలనుంది. ఈ సంస్థకు వచ్చే మొత్తం నిధులలో అగ్ర భాగం అమెరికా నుంచే వస్తుంది. ఇప్పుడు అమెరికా ఈ నిధులను ఆపేసినట్లయితే, డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.