క్వరెంటైన్‌లో కుటుంబం; ఇంట్లో దొంగలు

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఈనేపథ్యంలో క్రైం రేట్ చాలా వరకు తగ్గింది. కానీ.. కొన్నిచోట్ల మాత్రం నేరగాళ్లకు ఇదే మంచి సమయంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరైనా వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయి ఇళ్లు ఖాలీగా కనిపించినా లేదా ఏదైనా కుటుంబం క్వరెంటైన్ సెంటర్లో ఉన్నా అలాంటి ఇళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు దొంగలు.

తాజాగా.. నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని చంద్రబాబు నగర్‌లో ఉన్న ఓ ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న ఒకటిన్నర లక్ష నగదుతో పాటుగా, 20 సవర్ల బంగారం దోచుకెళ్ళారు. ఆ ఇంటి పెద్ద ఢిల్లీ వెళ్లొచ్చిన వాళ్లలో ఒకరు. అనుమానంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించినప్పుడు పాజిటివ్ అని రావటంతో ముందస్తు జాగ్రత్తగా మొత్తం కుటుంబాన్ని క్వరెంటైన్ సెంటర్‌కు తరలించారు.

కుటుంబంలో మొత్తం 9 మంది ఉంటున్నారు. అందరినీ క్వరెంటైన్‌కు తరలించడంతో ఇళ్లు ఖాలీగా ఉంది. ఇదే అవకాశంగా చూసుకొని దొంగరు చోరీకి పాల్పడ్డారు. తాజాగా.. ఆ కుటుంబ సభ్యులు 14 రోజుల క్వరెంటైన్ పీరియడ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి చూడగా ఇళ్లంతా చిందవందరగా ఉండటం, వస్తువులు, నగదు కనిపించకుండా పోవటం చూసి షాక్ అయ్యారు.

పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అంబులెన్స్‌తో వచ్చి హడావుడిగా తమను క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లారని, ఇంట్లోని వస్తువులను భద్రపరుచుకునే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. ఇంటి గురించి బాగా తెలిసన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు.

thief-700