తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన సౌందర్య అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ఈమె పూర్తి పేరు సౌందర్య సత్యనారాయణ. సినిమాల్లో ఎక్కడా అశ్లీలతకు తావివ్వకుండా, సాంప్రదాయంగా కనిపించే ఈ బెంగుళూరు సుందరి తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలలో సుమారు 100కు పైగా చిత్రాలలో నటించి అభిమానులను అలరించింది.
సౌందర్య మనతో భౌతికంగా దూరమై నేటికిగా 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండే సౌందర్య చిన్న వయస్సులోనే (31 ఏళ్లప్పుడే) ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు విమాన ప్రమాదంలో ఆమె మరణించింది.
ఏప్రిల్ 17, 2004న విమాన ప్రమాదంలో సౌందర్య ప్రాణాలు కోల్పోయింది. ఆర్ఎస్ఎస్ ప్రభావంతో బిజెపిలో చేరిన సౌందర్య అప్పట్లో ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటుగా ఆమె సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు.
సౌందర్య మరణంపై అప్పట్లో అనేక పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. సౌందర్య నటించిన చిత్రాలలో అమ్మోరు (1994), అంత:పురం (1998), రాజా (1999), ద్వీప (2002) చిత్రాలు ఆమెకు మర్చిపోలేని పేరుతో పాటుగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను తెచ్చిపెట్టాయి. సౌందర్య 12 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆరు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.