హెలీకాప్టర్ మనీపై తప్పుడు ప్రచారం!

మొన్నామధ్య తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ హెలికాప్టర్ మనీ గురించి ప్రస్థావించారు. ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైంది. ఈ కరోనా లాక్‌డౌన్ ఇలానే కొనసాగితే త్వరలోనే హెలికాప్టర్ నుంచి నేలపైకి డబ్బులు విసిరేస్తాంరటూ వివిధ సామాజిక మాద్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి పుకార్లను నమ్మకండి. అసలు హెలికాప్టర్ మనీ అంటే ఏంటో తెలుసుకుందాం రండి.

హెలీకాప్టర్ మనీ అంటే..?
దేశ ఆర్థిక పరిస్థితులు క్షీణించినప్పుడు, ప్రజల ఆదాయం పూర్తిగా తగ్గిపోయి వారి కొనుగోలు శక్తి శూన్యమయినప్పుడు ప్రభుత్వమే నేరుగా ప్రజలకు ఉచితంగా నగదు పంపిణీ చేయటాన్ని హెలికాప్టర్ మనీ అంటారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఉచితంగా రూ.1,000 మరియు రూ.1,500 పంపిణీ చేస్తున్నారే అలా అన్నమాట. కాకపోతే, హెలికాప్టర్ మనీ అమలు చేస్తే ఈ పంపిణీ పరిమాణం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది.

హెలికాప్టర్ మనీ ప్రతిపాదనను 1969లో అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2002లో మరో ఆర్థికవేత్త బెన్ బెర్నాంకె దానికి మెరుగులు దిద్ది, ప్రాచర్యంలోకి తీసుకొచ్చారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వమే ఎక్కువ మోతాదులో కరెన్సీ నోట్లను ముద్రించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయటాన్ని హెలికాప్టర్ మనీ అంటారు.

సాంకేతిక పరిజ్ఞానం అంబాటులో లేని ఆ రోజుల్లో ప్రజలకు అకస్మాత్తుగా డబ్బు వచ్చి చేరాలంటే హెలికాప్టర్ నుంచి డబ్బులు విసిరేయటం లేదా ప్రజల ఇళ్ల ముందు, బాల్కనీలలో డబ్బులు ఉంచడం లాంటిది చేయాల్సి వచ్చేంది. అందుకే అప్పట్లో దీన్ని హెలికాప్టర్ మనీ అన్నారు, ఆ పేరు అలానే కొనసాగుతూ వచ్చింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిస్థితుల్లో ఇలా జరగదు. ఒకవేళ హెలికాప్టర్ మనీ ప్రతిపాదన అమలైతే నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు చేరుతుంది. కానీ.. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి మరీ అంతకు దిగజారలేదు కాబట్టి ఈ ప్రతిపాదన కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

కాబట్టి మిత్రులారా.. ఎవరైనా హెలికాప్టర్ నుంచి డబ్బులు విసిరేస్తారని పుకార్లు పుట్టిస్తే మాత్రం వాటిని నమ్మకండి.

Helicopter-Money