హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా.. నగరంలో స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే యువకుడికి కరోనా పాజిటివ్ రావటం ప్రజల్లో/అధికారుల్లో కలకలం రేపుతోంది. ఢిల్లీ మార్కజ్‌కు వెళ్ళి వచ్చిన అతని తండ్రి ద్వారా స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.
లాక్డౌన్ సమయంలో అత్యవసర మరియు నిత్యావసర సేవలు మినహా దాదాపు అన్ని ఇతర సర్వీసులు పూర్తిగా మూతపడ్డాయి. అయితే, స్విగ్గీ వంటి కొన్ని ఫుడ్ డెలివరీ కంపెనీలు ఆహారంతో పాటుగా నిత్యావసరాలను కూడా ప్రజలకు చేరవేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా డెలివరీ బాయ్‌కి కరోనా సోకితే అతని ద్వారా వైరస్ చాలా మందికి సంక్రమించే ప్రమాదం ఉంది.
గడిచిన రెండు వారాలుగా సదరు స్విగ్గీ డెలివరీ బాయ్ ఏయే రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్లు తీసుకున్నాడు, ఎవరెవరి ఇళ్లకు డెలివరీ ఇచ్చాడనే విషయంపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకిన స్విగ్గీ డెలివరీ బాయ్ నాంపల్లి ప్రాంతంంలో లక్ష్మి నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఇతడు మార్చి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్విగ్గీ డెలివరీలు చేసినట్లు అధికారులు గుర్తించారు.